Tuesday, 5 May 2015

గొంగలి పువ్వు - బహుదళిత - విమలక్క
                                                          ~ విశ్వనాధుల ఫుష్పగిరి.

అనాది పూర్వపు సంతతి
అచ్చుల పోసిన ఇనుము
అచ్చరాలు నేర్సిన సంగతి
వీరభోజ విశ్వకర్ముడి నవీనత్వం
లందల సిద్దులకక్కనెత్తుకున్న బ్రహ్మానికి
ఆవల ఈవల వీరభోగవసంతమై
పూసిన మానవ శ్రమజీవన రక్త పళిమరం

కాల కల్మషం అంటుకున్న
మనిషికి మనిషే దూరంగా వెలివేయబడ్డది
పొలిమెర ఇవుతల - పొలిమెర అవుతల
పొలం గట్టు మీద - వరం కింది బుర్దమల్ల
గర్శెల రాసులు - తవ్వెడు చాటలు

వెలివేతకు అటుగా - ఇటుగా మేమే
అటు ఇటు కాకుండ మాలా మేమే

మాతల్లి మట్టిని సంకటి ముద్దలుగా కలిపి
సనుబాల గంజితో జాతి డొక్కనింపుతున్నది
నేలతల్లి సెమటతో సేదదీరే మా జాతి
ఎప్పుడూ కాళ్ళనే నమ్ముకున్నది
ఆ కాళ్ళు నమ్ముకున్నది ఈ నేలనే

ఆకాసానికి అంగిలేని ఒంటికి నడుమ
కమ్మలగుడిశెలల్లిన సుర్కుడుబద్ద సాచ్చ్యెం
చెప్పుటుంగరం తోలుమడ్తల్ల
తిర్గిన ఆరె జౌడిక జముకుల మోతని
డప్పు శిర్రల పైన జ జజ్జనకాడించ్చింది

మానోట్లే నానిన శియ్యలు
గొర్రెపోడెండ్ల అరలపొట్ట పేగులు
పనికత్తి కట్కెసుర్కత్తి సాముల సారాంశమే

డంగుదిర్గిన సున్నపుసూరు
నెత్తుటి మర్కలంటుకున్న గనేటురాయితో
మొల్సిన ఘడీలకు అల్కుల పట్టెలైనయి

మాడొక్కలంగెల్లిన గడ్డపారలు
ఏడుగోలల లోతుల మంచినీళ్ళైనయి

భూమికి సారెబోసిన మెడమీద భూచక్రమై
తిరిగి కన్నీళ్ళ వతన్లు నాజూకు కూజలైనయి

మూల్గలర్గిన ఉడ్తె మీద సాపిన పోగుల ఆల్లు సాగి
ఆకలి పింజిర్లమీద రక్తవర్ణాల సీరె సాకపోసుకున్నది

సౌడుమట్టిని బట్టపేగులకు మల్లెరేకొల్గేఅత్కి
ఔరేనికుండలమీద అంటిముట్టని వల్లెడైనది

కత్తి కొరిగిన సవురం కట్టడి సానమీద
ఇంటికిరాని ఇత్తులై బైరిగడ్డాల నడుమ ఇగురిచ్చినది

కూట్లకు ముందే చాటల్ల వసంతమాడిన పకుర్తి
మాజాతింటి జల్లెట్ల దాసెన పసుపుతో నీళ్ళాడింది

గీసకత్తి పగటికి మూడు గీతల సార్కలు ఒంటి తాటిమీద
మడ్డిగట్టిన సుర లొట్టిలో రాలిపడ్డ జీవితం పట్వల పొంగిపొర్లింది

మున్నూటర్కల సావుసం మట్టిని ముద్దాడి
మొల్కలైన జివాల రాసులు కుప్పగొట్టి
కుండెడు కుందెన్ల రేల రోకలి పోటుకు శిత్కిపోయి
గొట్టొడ్లబువ్వ రాచిప్పల గొడ్డుకారంతో సరం దిగని ముద్ద
కల్లెడవుతల
కుసుమబియ్యం యేటపోతుల యేపుడుతో
కుత్కెల యేలువట్టని ఇక్కసమై మర్రూడలూపుల
ఈదంబాయి కట్టమీద పొర్లాడింది

జాతి దాట్ల దొర్లిన మోటబొక్కెన నీళ్ళు
దోశిట్ల కషమై దాటి అంగిట్ల సుద్దకట్టువడ్తే
కల్లమౌతల
ఇత్తడి గుర్గిల సల్లయి
పేగుల్ని మత్పరిచ్చింది

జాతి కాయకష్టాన్ని పెడరెక్కల్గ ఇర్సి
బతికున్న పీనిగెల పెయ్యిమీద గూనపెంకలోల్గె పేర్సి
బత్కిసావలేక గడీల
అంగట్ల జాతి కమ్మలగుడ్శెను నింగలాల మీద
బరెంకలు తేలిన ఒళ్ళు
పుట్నాలై ఏగి చీముగుడ్లై చితికిపోయింది

భూమ్మీదవడ్డ ఇత్తనం తొల్సూరి సినుకుకేతడ్శి
కార్తె పదునారకముందే తంగెళ్ళగడ్డమీద
శిబ్బిపూలావనమై పర్సుకున్న బత్కుతీగలు
కొలిమినల్లుకొని డాకలిమీది సమ్మెట దరువుతో
కాలిగజ్జెలాటై ఆది-సింధుల సుట్టిర్కమయ్యింది

రేగట్ల కంచెల మేస్తున్న జివాలు
కంచెనే మింగజూస్తున్న ముర్గాల్ని వాసనవట్నయి
జాతి జీవాలు ముర్కవట్టినయి
ఆ జాంతువు కొంగజపం నేర్సిన
నక్క వూలలువెట్టే నాటకి గుంట తోడేలు
జాతి జివాలు పాడిన పాటకు
గుంట తొక్కకు రోమరోమాన పంచకం పుట్టి
తోకపీకుడుగాని కథ యాదిజేసుకుంది

గడీ.. నింగలాన్ని పిడికిట దాయలేవు
గోశిల మూటగట్టలేవు
నిర్భందం ఒక ఇనుప విచారం
కండ్లు మూసుకుంటే కాటిక కాలికంటదు

మల్లోపాలి..
ఇది బహుదళితజనత్వం
జాతి జనుల జీవనతత్వం
మేటేశకాని కోటల మీద ఈటెలిసిరిన సత్తెం
బహువన్నెకాని బహురూప వారసత్వం
వేలగొంతులనుపుక్కిటవట్టి ఆడెకాళ్ళకు సాకవోసిన సంచారి
పాట నేర్సిన గొంగడి పువ్వు ఎర్రపొద్దులమిత్ర విమల

_____________________________________

పాత గోడల గడీలకు కొత్త సున్నాన్నేస్తున్న దొరల సర్కారు మాజాతి గొంతులోని పాటను సర్కారు గడీలల్ల నిర్భందాలపాల్జేసింది. అణిచివేతలకు గురిచేస్తోంది.

*గుంట తొక్క - గుంట నక్క+తోడెండ్ల సంకర పదం..


~ విశ్వనాధుల ఫుష్పగిరి.9666435426

No comments:

Post a Comment